నియంత పాలనకు చరమగీతం పాడాలి

  • ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ
    తొర్రూరు:
    యువత బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, ఈ ఎన్నికల్లో ఆ పాలనకు చరమగీతం పాడాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలి శర్మ అన్నారు.

మంగళవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి లతో కలిసి డాలి శర్మ మాట్లాడారు.

ఈ సందర్భంగా డాలి శర్మ మాట్లాడుతూ…..
రాష్ట్రంలోని అన్ని స్కామ్‌లలో కేసీఆర్‌ ఫ్యామిలీ ఉందన్నారు. ఇంటింటికి లిక్కర్‌ స్కీమ్‌ అన్నట్లు కవిత లిక్కర్‌ వ్యాపారం చేస్తుందన్నారు. తెలంగాణలో 35 వేల మంది మహిళలు మిస్సింగ్‌ అయినా ఏ ఒక్క పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదన్నారు. బీజేపీ గ్యాస్‌ ధర అడ్డగోలుగా పెంచిందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుందన్నారు.
తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ సభలో సోనియా గాంధీ చెప్పిన మాట నిలబెట్టుకొని రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. సోనియా ఇచ్చిన తెలంగాణలో బాగుపడ్డది కేసిఆర్, వారి కుటుంబం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని చెదలు పట్టినట్టు పట్టి, మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుందని విమర్శించారు. యువకుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్రం నియంత పాలనలోకి చేరి, ప్రమాదపు టంచుల్లో ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారం కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుంద‌న్నారు.
తెలంగాణా ఏర్పాటు విషయంలో మాట నిలబెట్టుకున్నట్లే, ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని డాలీ శర్మ అన్నారు. మాహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాలను తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డిలు మాట్లాడుతూ….
పాలకుర్తిలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, గెలవాలని పాలకుర్తి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి గారడీ మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. పాలకుర్తి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎర్రబెల్లిని పర్వతగిరికి పంపించడం ఖాయమన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అబ్జర్వర్ రవీంద్ర దాల్వి, మహారాష్ట్ర ఎమ్మెల్సీ రాజేష్ రాథోడ్, ధరమ్ సింగ్, పార్లమెంటరీ ఇంచార్జి శోభారాణి, అనిల్ కుమార్,
నాయకులు ముత్తినేని సోమేశ్వరరావు, కాకిరాల హరిప్రసాద్, ఎన్. ప్రవీణ్ రావు పెదగాని సోమయ్య, ఎర్రబెల్లి రాఘవరావు, వెంగళరావు, కొమురయ్య, సుంచు సంతోష్, సోమ రాజశేఖర్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *