కాంగ్రెస్‌ గెలిస్తే నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి : ప్రియాంక గాంధీ

పాలకుర్తి: తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే గర్వంగా అనిపిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడింది. త్యాగాల మీద ఏర్పాటైన రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావించాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో.. లేదో ప్రజలు ఆలోచించాలి. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగింది. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్‌ కావడంతో యువత నిరాశకు గురయ్యారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడింది. ఆ యువతి పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి. అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. పేపర్‌ లీకేజీలను అరికడతాం. ఇంటిని నడిపించే గృహిణికి ఎన్నో కష్టాలు ఉంటాయి. అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్దామంటే చేతిలో డబ్బు ఉండదు. పిల్లలకు స్కూల్‌ ఫీజు చెల్లించేందుకు ఒక్కోసారి డబ్బులు ఉండవు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి.. కాంగ్రెస్‌ రావాలి. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గరపడిందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

భారాస పదేళ్ల పాలనలో ఎవరికీ మేలు జరగలేదు

హుస్నాబాద్‌ : భారాస పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. హుస్నాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. కేసీఆర్‌ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. ఇవాళ నిరుద్యోగంలో తెలంగాణ నంబర్‌ 1గా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యువత భవిష్యత్‌ ఆగమైందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. యువత కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్లు లీక్‌ చేసి వారి భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస పదేళ్ల పాలనలో ఎవరికీ మేలు జరగలేదని ప్రియాంక ఆరోపించారు. ‘‘మీకు అన్యాయం జరిగినప్పుడు మీ ఎమ్మెల్యే గొంతెత్తి మాట్లాడారా? మీ సమస్యలపై నోరువిప్పని ప్రజాప్రతినిధి మీకు అవసరమా.. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ భారాస ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ సర్కార్ సంపన్నులకే లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *