బీజేపీ చెప్పిన చోటే మజ్లిస్‌ పోటీ : రాహుల్‌ గాంధీ

భారాసకు ఓటేస్తే మళ్లీ దొరల సర్కార్‌….కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్‌

యువ వికాసం పేరుతో విద్యార్థులకు రూ.5లక్షల ఆర్థికసాయం చేస్తాం

నాంపల్లిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌

హైదరాబాద్‌ : ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మజ్లిస్‌ పోటీ చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు. ఢిల్లీ లో ఎంపీల నివాసం నుంచి తనను వెళ్లగొట్టినా బాధపడలేదన్నారు. దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని బయటకి వచ్చినట్లు చెప్పారు. ఈడీ విచారణ పేరుతో తనను గంటల కొద్దీ కూర్చోబెట్టారన్నారు. బీజేపీ చెప్పిన చోటే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారు. బీజేపీ , భారాస, ఎంఐఎం ఒకటే టీమ్‌..వారు కలిసే పనిచేస్తారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసూ లేదు. మోడీ సర్కార్‌ తెచ్చిన అన్ని బిల్లులకు భారాస మద్దతు పలికింది. భారాసకు ఓటేస్తే మళ్లీ దొరల సర్కార్‌. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రజల సర్కార్‌ ఏర్పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మంజూరు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. బీజేపీ, భారాస పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయి. రూ.1200కు పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే అందిస్తాం. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు చొప్పున ఇస్తాం. యువ వికాసం పేరుతో విద్యార్థులకు రూ.5లక్షల ఆర్థికసాయం చేస్తామని రాహుల్‌ గాంధీ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *