ప్రజలకు మేలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలి

  • నిరుద్యోగుల కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ రావాలి
  • కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ

తొర్రూరు:

ప్రజలకు మేలు చేయని బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని మార్చే సమయం, అవకాశం వచ్చిందని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో జరిగిన కాంగ్రెస్​ విజయ భేరి సభలో ఆమె పాల్గొన్నారు.
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి అధ్యక్షతన జరిగిన విజయభేరి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ…
పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలోనే బందీ అయిందని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందని.. అందుకే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఒక్కసారి తెలంగాణ వాసులు ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో లేదో ఆలోచించుకోవాలని సూచించారు. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్​ వన్​గా ఉందని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొరూరులో నిర్వహించిన కాంగ్రెస్​ విజయ భేరి సభలో ఆమె పాల్గొని.. బీఆర్​ఎస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో కుంభకోణం జరిగిందని.. పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారని ప్రియాంక గాంధీ ఆవేదన చెందారు. అలాగే కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడిందని మండిపడ్డారు. అసలు ఆ యువతి దరఖాస్తు చేయలేదని మాట్లాడారన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్​ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని ఆమె హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జాబ్​ క్యాలెండర్​ అమలు చేసి.. పేపర్​ లీకేజ్​లను అరికడతామని మాటిచ్చారు.
ఇంటిని నడిపించే గృహిణికి ఎన్నో కష్టాలు ఉంటాయని.. పిల్లలకు స్కూల్​ ఫీజులు, అనారోగ్య సమస్యలు వంటివి ఉంటాయన్నారు. అందుకే కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే మహిళల కష్టాలు తొలగిపోతాయని ప్రియాంక అన్నారు. ప్రతి నెల మహిళ ఖాతాలో రూ.2500 వేస్తామని.. గ్యాస్​ సిలిండర్ రూ.500కే ఇస్తామని చెప్పారు. అలాగే మహిళామణులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోందని అన్నారు. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని చెప్పారు.
‘కేంద్రం పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయని , జీఎస్టీ, పెట్రోల్​ ధరల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. వస్తువుల ధరలు మళ్లీ తగ్గాలంటే కాంగ్రెస్​ అధికారంలోకి రావాలన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు ధాన్యంపై క్వింటాల్​కు అదనంగా రూ.500 బోనస్​ ఇస్తామని, కొన్ని వస్తువులకు ఎక్స్​పైరీ డేట్​ అయిపోయినట్లే.. బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి డేట్​ ముగిసిందన్నారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….
ధర్మానికి, అధర్మానికి… ప్రజా పరిపాలనకు ,దొరల పాలనకు జరుగుతున్న యుద్ధం ఈ అసెంబ్లీ ఎన్నికలు అని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.

టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ….

తెలంగాణలో కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఓటు అనే ఆయుధంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ….
యశస్విని రెడ్డి అత్తమామలు ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు ఆసుపత్రులు, విద్యాలయాలు కడితే ఎర్రబెల్లి గ్రామ గ్రామాన స్మశాన వాటికలు కట్టాడన్నారు.
కెసిఆర్ ప్రభుత్వంలో మందు తాగాలి… వారు కట్టిన స్మశాన వాటికకు వెళ్లాలి అనే ధోరణిలో ఉంది బీఆర్ఎస్ పాలన అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు ఏ సమయానికి వస్తాయో తెలియదు గానీ మద్యం దుకాణాలు ఏ సమయానికి తెరుస్తారో ప్రజలకు బాగా తెలుసునన్నారు.
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి మాట్లాడుతూ….

ఝాన్సీ రెడ్డి కి పౌరసత్వం రాకుండా అడ్డుకున్నారేమోగాని వారసత్వం రాకుండా అడ్డుకోలేక పోయారన్నారు.
దగాకోరు దయాకర్ రావు ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవ చేస్తానని, తనకు వచ్చే జీతాన్ని సైతం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తానని హామీ ఇచ్చారు.

ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ….

దయాకర్ రావు యశస్విని రెడ్డి వెనక కుటుంబం లేదని మాట్లాడావు… ఇప్పుడు నా కుటుంబం అంతా నా వెన్నంటి ఉంది…. ఇప్పుడేం సమాధానం చెప్తావు అని ఝాన్సీ రెడ్డి ప్రశ్నించారు.
నా కుటుంబం గురించి మాట్లాడే అర్హత దయాకర్ రావుకు లేదు అని తెలిపారు.
పాలకుర్తి ప్రజలే మా కుటుంబం అని… దయాకర్ రావు ఓడిపోతే ఆయన వెంట ఉండేది ఆయన కుటుంబం మాత్రమేనని స్పష్టం చేశారు.
మేము అమెరికాకు వెళ్తామని అసత్య ప్రచారం చేస్తున్నారని… అమెరికా వెళ్లడానికి రాలేదని దయాకర్ రావు అంతు చూడడానికి వచ్చామని స్పష్టం చేశారు.
యశస్విని రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *