‘అవుకు టన్నెల్’ ప్రారంభోత్సవ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండో సొరంగం పనులు పూర్తి

సీఎం చేతుల మీదుగా ‘గాలేరు-నగరి’ కాలువ ద్వారా 20వేల క్యూసెక్కుల తరలింపే తరువాయి

నంద్యాల : అవుకు రెండో టన్నెల్ సీఎం చేతుల మీదుగా ఈ నెల 30వ తేదీన ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువలో అంతర్భాగమైన అవుకు టన్నెల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గాలేరు-నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ ను నింపడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రాయలసీమలో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగు పరచడానికి ఈ ప్రాజెక్టు కీలకం కానుందన్నారు. శ్రీశైలనికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 20వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించడమే లక్ష్యమన్నారు. తద్వారా ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగునీటి అవసరాలను తీర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. గోరుకల్లు నుంచి 20వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 60 కి.మీ పొడవున వరద కాలువ, కొనసాగింపుగా సొరంగం తవ్వకం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఫాల్ట్ జోన్ లో సొరంగానికి 165 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్ తో లైనింగ్ చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు మంత్రికి ఈ సందర్భంగా వివరించారు. అసాధ్యమనుకున్న అవుకు రెండో టన్నెల్ తవ్వకం పనులు పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 30వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. అందులో భాగంగా ఆదివారం అరకు టన్నె ల్ వద్ద హెలిప్యాడ్ నుంచి టన్నెల్స్ వరకు రహదారిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు.సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని కూడా మంత్రి పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *