ఐదేళ్లకు ఒకసారే.. ఓటేద్దాం చలోరే

హైదరాబాద్‌ : ప్రతి సైనికుడూ నేనొక్కడినీ పోరాడకపోతే ఏమౌతుందిలే అనుకుంటే మన పరిస్థితేంటి? ఓటు కూడా అంతే. అందువల్ల నేనొక్కడిని ఓటు వేయకుంటే ఏమౌతుందిలే అనే ధోరణిని వదిలించుకుందాం. నేను ఒక్కడిని ఓటేస్తే ఈ సమాజం మారిపోతుందా? అని కొందరు వితండవాదం చేస్తుంటారు. ఓటు వేసిన వాళ్లు ప్రశ్నిస్తేనే.. ప్రజాప్రతినిధులు పట్టించుకోని పరిస్థితి. అలాంటిది అసలా హక్కు వినియోగించుకోనప్పుడు నేతల్ని నిలదీసే అవకాశం, హక్కు ఉండదనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి అడిగే హక్కు ఉండాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ప్రభుత్వాలు నాకేం చేశాయని నేను ఓటెయ్యాలి? ప్రభుత్వాలు నాకేం చేస్తున్నాయి? ఎవరు పాలించినా సమస్యలు మాత్రం పోవడం లేదు కదా? ఈ తరహా చర్చలతో సమాజం మారిపోతుందా? సమస్యలు తీరుతాయా? ప్రభుత్వాలకే కాదు, ప్రజలకూ కొన్ని విధులు, బాధ్యతలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రధానమైనదే ఓటు హక్కు వినియోగించుకోవడం. ఓటు వేయాల్సిన ధర్మం పాటించకుండా ప్రభుత్వ ఫలాలు మన ఇంట్లోకి అడుగు పెట్టాలనుకోవడం స్వార్థమే కదా.? బాధ్యత నిర్వర్తించనప్పుడు బాధలు తీర్చాలంటూ నిలదీసే అవకాశం ఎక్కడుంటుంది?. ఇవి ఎవరికి వాళ్లు వేసుకోవాల్సిన ప్రశ్నలు.

వీరిని స్ఫూర్తిగా తీసుకుందాం : తండాల గిరిజనులు ఓటు వేయడానికి కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ఓటేసి వస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన జనం ఓటును ప్రాణంగా భావిస్తారు. ఓటు వేయకుంటే ఏదోలా భావిస్తారు. ఎలాగైనా వెళ్లి కచ్చితంగా ఓటేసి తీరుతారు. శతాధిక వృద్ధులు, దివ్యాంగులు సైతం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసి స్ఫూర్తిని చాటుకుంటున్న సందర్భాలనేకం. మరి కేవలం 100 నుంచి 500 మీటర్ల దూరంలోగల పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేందుకు మనకెందుకు అలసత్వం. పదండి వడివడిగా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *