చేనేత పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

గూడూరు చేనేత పారిశ్రామిక సంఘం చైర్మన్ కృష్ణమూర్తి

పాలకుర్తి :
చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం అభివృద్ధికి చేనేత కార్మికులందరూ తోడ్పాటున అందించాలని చేనేత పారిశ్రామిక సంఘం చైర్మన్ రచ్చ కృష్ణమూర్తి కోరారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో నిర్వహించిన సంఘం మహాసభకు చేనేత జౌళి శాఖ డివో బొట్టు రజిని తో కలిసి కృష్ణ మూర్తి పాల్గొన్నారు. 2023-24 బడ్జెట్ లావాదేవీలు ఆమోదించటంతో పాటు 2021-22,2022-23 ఆడిట్ నివేదికను ఆమోదించాలని, ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ కు ఆమోదం కోసం మహాసభలో ఎజెండాను ప్రవేశ పెట్టామని కృష్ణమూర్తి తెలిపారు. సొసైటీ పరిధిలోగల కొత్త సభ్యులకు సభ్యత్వం వర్తింపజేయడంతో పాటు అర్హులైన చేనేత కార్మికులకు బ్యాంకుల నుండి ముద్ర రుణాలు అందించాలని, చేనేత కార్మికులకు వర్క్ షెడ్డుతో పాటు నూలు సబ్సిడీపై 40% పెన్షన్ అందించాలని, జీఎస్టీ చెల్లించే ప్రతి చేనేత కార్మికునికి 2000 పెన్షన్ అందించాలని మహాసభలో చేనేత కార్మికులు కోరడంతో అమలు కోసం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ గూడూరు చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం నష్టాల్లో ఉందని, సంగం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. చేనేత కార్మికుల ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం మగ్గాలను అందించి ఆదుకోవాలని అన్నారు. కొత్త సభ్యత్వం నమోదుకు చేనేత జౌళి శాఖ అనుమతి ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పెనుగొండ కిష్టయ్య, కార్యదర్శి పాము యాదగిరి, సంఘం డైరెక్టర్లు చిలుకమారి రామస్వామి, గురుదాస్ శ్రీనివాస్, మడత దుర్వాసులు, దేవసాని ఉపేందర్, రచ్చ జ్యోతి, సామల కమలమ్మ తో పాటు చేనేత కార్మికులు ఐరోడ్ల మార్కండేయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *