చేసింది శూన్యం.. చెప్పేది నమ్మేదెలా

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి లో శంకుస్థాపన చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్….
రాయపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి శూన్యమని, ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్పే మాయ మాటలు ప్రజలేలానమ్ముతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో రూ. 10 కోట్లతో రహదారి విస్తరణ పనులు సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రూరల్ మార్ట్ ను ప్రారంభించారు. మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన అనంతరం స్వర్ణ భారతి మండల సమైక్య 14వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో తనకు నచ్చిన ముఖ్యమంత్రి ఇద్దరే ఇద్దరు అన్నారు. ఒకరు స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితే మరొకరు సీఎం కేసీఆర్ అన్నారు. మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారు ఆర్థిక స్వాలంబన సాధించాలని ఎన్టీఆర్ తన వంతు కృషి చేశారన్నారు. ఆ తర్వాత కొంత కొంతగా చేసిన వారి తప్పితే మహిళా సంఘాల ఉన్నతికి చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక మహిళా సంఘాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కోట్లాది రూపాయల రుణాలు అందిస్తూ మహిళా సంఘాల అభ్యున్నతికి పాటుపడుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని హామీలు ఇస్తున్నారు తప్పా వారు పాలించే రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదన్నారు. బూటకపు హామీలు ఇస్తున్న వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఏ రాష్ట్రాల్లో అమలు చేయని కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణలో అమలవుతున్నట్లు తెలిపారు. పేదింట్లో వివాహం చేయాలంటే ఎంత కష్టపడేవారో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ప్రభుత్వం తన వంతు అండగా నిలుస్తూ ఆదుకుంటున్నట్లు తెలిపారు. మహిళలు పడే కష్టాలను గుర్తించి తన వంతు అండగా నిలవాలని ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తన కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు అందించే డబ్బులతో కోట్లు వెచ్చించి మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా బీఅర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇతర పార్టీల నాయకులు చెప్పే మాయమాటలకు ప్రజలు మోసపోరన్నారు. తనను నమ్ముకున్న ప్రజల అభివృద్ధి కోసం అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బీఅర్ఎస్ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్, రైతుబంధు మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు,బీఅర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, గ్రామ సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీలు ఐత రాం చందర్ బిల్లా రాధిక సుభాష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్లు కుందూరు రామచంద్ర రెడ్డి, జక్కుల వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *