పద్మశాలి కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి:
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పాలకుర్తి మండల సోమనాథ పద్మశాలి సంఘం వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తరుపున నిర్మించనున్న పద్మశాలి కళ్యాణ మండపం నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో స్వరాష్ట్రం సాధించి ప్రభుత్వం ఏర్పడిన తరువాతే కులవృత్తులకు గౌరవం లభించింది అన్నారు. సమైక్య రాష్ట్రంలో మన కుల వృత్తులకు ఎప్పుడైనా న్యాయం చేశారా…? అనేది పద్మశాలీలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాగే పద్మశాలి కుటుంబాల ఉపాధి కోసం బతుకమ్మ చీరలను నేసే బాధ్యత కల్పించారన్నారు. నేతన్నలకు పని కల్పించి వారు గౌరవంగా బతికేలా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. మన ప్రాంతంలో వలస జీవులుగా మారుతున్న నేతన్నలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నది మన BRS పార్టీ ప్రభుత్వమే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొడకండ్ల లో వచ్చే నెల ఆరో తేదీన మినీ టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. పద్మశాలీ బిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు చేసిన ఉద్యమాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. అలాగే పద్మశాలి ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే భాగ్యం తనకు లభించింది అన్నారు. వారి సలహాలు, సూచనలు ఉద్యమంలో చాలా ఉపయోగపడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు మంత్రి పదవిని వదిలి, రాజకీయాలకు స్వస్తి చెప్పి, చివరి వరకు పోరాటం చేశారు అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమం కూడా బాపూజీ జల దృశ్యం నుంచే మొదలైందని చెప్పారు. పద్మశాలి నేతలు నల్ల నరసింహులు, కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికి ఆదర్శమని మంత్రి అన్నారు. త్వరలో నల్ల నరసింహులు, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను పాలకుర్తిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పద్మశాలీలు చాలా గౌరవంగా బతికే వారని, ప్రాణం పోయినా కూడా ఇచ్చిన మాట మీద నిలబడు నిలబడతారని, వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత కూడా తనదేనని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పద్మశాలి నేతన్నలకు పెన్షన్ అందిస్తున్నామని, ఇప్పుడు నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి 40 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ప్రస్తుతం 20 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధిని ప్రజల ముంగిట్లో కి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పద్మశాలి సంఘం నేతలు, మండల పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *