ఆత్మ బలిదానాల వల్లే తెలంగాణ

  • నయవంచక పాలనకు బుద్ధి చెప్పాలి
  • టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
    తొర్రూరు:

ప్రజల ఉమ్మడి పోరాటం, ఆత్మ బలిదానాల వల్లే తెలంగాణ ఏర్పడిందని టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.

 తెలంగాణ పీపుల్స్ జేఏసీ, తెలంగాణ సమాఖ్య, జాగో తెలంగాణ,  భారత్ బచావో సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వెలికట్ట శివారు రామా ఉపేందర్ గార్డెన్ లో పదేళ్ల తెలంగాణ- ప్రజల ఆకాంక్షలు అనే అంశంపై చైతన్య సదస్సు నిర్వహించారు.

      తెలంగాణ పీపుల్స్ జేఏసీ కో కన్వీనర్ కరుణాకర్ దేశాయి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కోదండరాం కీలకోపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చి తెలంగాణను కుటుంబ జాగీరుగా మార్చారని విమర్శించారు.
కమీషన్ల కక్కుర్తితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశారని, మూడేళ్లు పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోవడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమన్నారు.
ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుందని, కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారన్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదని, సర్కారు నడిపే పద్ధతి ఇది కాదని.. మంది సొమ్ము తినడం మంచిది కాదని చెప్పినందుకే నాతో కేసీఆర్ గొడవ పెట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెస్తే.. చనిపోయిన వారి త్యాగాలకు ఎలా విలువ కట్టాలని అన్నారు. తెలంగాణ ప్రజల తరఫున తీర్పు చెప్పే అవకాశం కామారెడ్డి ప్రజలకు దక్కిందని, ఆ స్థానంలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.
మేడిగడ్డ కూలినట్లు కేసీఆర్ సర్కారును కూల్చాలన్నారు.
ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతు తెలుపుతుందన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పాలనలో మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వి రెడ్డిని మద్దతు తెలపాలని కోరారు.

ఈ సదస్సులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి .నిరూప్, ప్రొఫెసర్ వెంకటనారాయణ , స్కై బాబా,మైస శ్రీనివాస్, అంబటి నాగయ్య, సతీష్ గౌడ్, చిట్యాల రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *